పేదరికం పోవాలి.. తలసరి ఆదాయం పెరగాలి
కొత్త ఆలోచనలతో అభివృద్ధి దిశగా అడుగులు
అమరావతితోపాటు పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం
త్వరలోనే తల్లికి వందనం అందిస్తాం..
జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
2047 నాటికి భారతదేశం అగ్రగామిగా ఎదుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు
ముప్పాళ్ల, ఆంధ్రప్రభ :
రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశామని, సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారు.. ఇప్పుడు పి4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్లలో నేడు జరిగిన డాక్టర్ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు. ఇక, 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సి అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందన్నారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే తల్లికి వందనం అందిస్తాం..
త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తామన్నారు. అలాగే, రాజధాని అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఇక, ప్రజలకు ఇచ్చిన సూపర్-6 హామీలు అమలు చేసి తీరుతామన్నారు. దేశంలో ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.. మరొ రాష్ట్రం లేదు అన్నారు. అలాగే, పేదరిక నిర్మూలన జరగాలి.. తలసరి ఆదాయం పెరగాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించి రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి పోయిందన్నారు.. నాయకుడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని పేర్కొన్నారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుంటుందన్నారు. అప్పట్లో తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని అన్నారు. ఇప్పుడు తెలుగువారు ప్రపంచంలోని ప్రతీ దేశంలో సత్తా చాటుతున్నారు. మట్టిలో మాణిక్యాల్లాంటివారు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారని పేర్కొన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. సంపదను సృష్టించి అందరికీ పంచుతామని అంటూ అట్టడుగున ఉన్న 25 శాతం మంది పేదల కోసమే పీ4 తీసుకువచ్చాం. అని చంద్రబాబు వివరించారు.