ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : భూములు, ఇల్లు, దుకాణాలు క్రయవిక్రయాలకు సంబంధించి నిర్వహించే రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు గంటలకు ఒకప్పుడు ఎదురుచూసే సందర్భం. ఇప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి వెళ్లిన 10 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ దృపత్రాలను వినియోగదారుడు చేతుల్లో పెట్టడంతో పాటు, వాట్సప్ కూడా డాక్యుమెంట్లు చేరే విధానం వచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని, మరిముఖ్యంగా ఏఐ టెక్నాలజీని అన్ని శాఖల పరిధిలో వినియోగించే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ శాఖలో కూడా వినూత్న ఆలోచనలతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, సేవలను మరింత సరళీకృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేయడమే కాకుండా 10 నిమిషాల్లోగా డాక్యుమెంట్ ను అందించే విధంగా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ పైలెట్ ప్రాజెక్టుగా మొట్టమొదటిసారిగా ఏపీలోనీ విజయవాడ పటమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం శ్రీకారం చుట్టారు. వినియోగదారుడు నుండి రిజిస్ట్రేషన్ కి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ స్వీకరించిన 7 నిమిషాలలో దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, ఈకేవైసీ తో పాటు మరికొన్ని విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏడో నిమిషం నుండి పదో నిమిషంలోగా డాక్యుమెంట్ అప్రూవల్ పొంది స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత వినియోగదారుడికి పదో నిమిషంలో డాక్యుమెంట్ అందజేయాలి. ఇదే సందర్భంలో సంబంధిత వినియోగదారుడికి డాక్యుమెంటును వాట్సాప్ కు కూడా పంపించాల్సి ఉంటుంది.
గతంలో రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించడం, కొన్ని సందర్భాలలో స్లాట్ లు లభించక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చేది. వాటన్నింటిని చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వినూత్న విధానం వినియోగదారుల నుండి ప్రశంసలను అందుకుంటుంది. పటమట సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోమవారం ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి గంటలో ముగ్గురు వినియోగదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు, పది నిమిషాల్లోగా వారి చేతికి డాక్యుమెంట్లను రిజిస్టర్ రేవంత్ అందజేశారు. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న ఈ విధానం ద్వారా వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.