ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ స్మార్ట్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు.
మహానుభావుడు అంబేద్కర్ తీసుకొచ్చిన అనేక సంస్కరణల వల్ల నేడు అందరూ ఈ స్థితిలో ఉన్నారన్నారు. అంటరానితనం, అసమానతలు, అవమానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారన్నారు. చదువుతోనే అంటరానితనం, అస్పృశ్యతలను రూపుమాపారన్నారు. ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం కావాలని ఆయన కృషి చేశారన్నారు. అంబేద్కర్ జయంతి అంటే అందరికీ పండుగ రోజు అన్నారు. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలంటే మంచి స్వభావంతో నడవాలన్నారు. మంచి స్వభావంతో, క్రమశిక్షణతో బతికినప్పుడే ఎదిగినట్లు అర్థమన్నారు.
ఆడపిల్లలను తక్కువగా చూడొద్దని, వారికి జాగ్రత్తలు చెప్పిన విధంగానే మగ పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ లో 91శాతం మంది గిరిజన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సాంఘిక సమానత్వం, అస్పృశ్యత నిర్మూలన, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. విద్య, జ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గిరిజన సాంప్రదాయ దీంసా నృత్యంతో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.