AP | వంద పడకల ఆసుపత్రిపై లోకేష్ స‌మీక్ష..

మంగళగిరి సమీపంలోని చినకాకానిలో కూట‌మి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. వంద పడకల ఆసుపత్రి కార్పోరేట్ హాస్పటల్ కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలన్నారు.

శంకుస్థాపన రోజు నుంచి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. అత్యవసర రోగులకు అవసరమైన లిఫ్ట్ సదుపాయం, విశాలమైన వాహనాల పార్కింగ్ ఉండాలని అన్నారు.

ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply