ఏపీ సర్కారు కసరత్తు
- నలుగురు మంత్రులు, ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలతో సమీక్ష
- నన్నూరులో బహిరంగ సభ, శ్రీశైలంలో రోడ్‌షోపై ఫోకస్
(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు (Kurnool) జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad), ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat), రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షేరాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.
రోడ్‌షో, సభలపై ఫోకస్…
ప్రధానమంత్రి పర్యటన (Prime Minister’s visit) సందర్భంగా కర్నూలు నగర పరిధిలో రోడ్డు షో, అలాగే నన్నూరు సమీపంలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వర్గం సమీక్షించింది. రోడ్డు మార్గంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, వీఐపీ మువ్‌మెంట్ రూట్‌మ్యాప్‌పై అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోడీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం శ్రీశైలంలో కూడా రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దానికనుగుణంగా భద్రతా ఏర్పాట్లు, గెస్ట్ మేనేజ్‌మెంట్, ప్రోటోకాల్ సమన్వయంపై అధికారులు వివరాలు సమర్పించారు.
వ్యాపారులతో సమావేశం కూడా…
పర్యటనలో ప్రధానమంత్రి జీఎస్టీ, పారిశ్రామిక రంగాలపై వ్యాపారులతో ముఖాముఖి చర్చలు జరపనున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం కర్నూలు నగరంలోని వాణిజ్య భవనాలను పరిశీలించి తగిన ప్రాంగణం ఎంపిక చేయాలని ఆదేశించారు.

భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి…
కర్నూలు, నంద్యాల (Kurnool, Nandyal) జిల్లాల పోలీస్ అధికారులు ప్రధాని పర్యటనలో త్రిస్థాయి భద్రతా కవచం అమలు చేయనున్నట్లు తెలిపారు. రహదారుల పరిశీలన, సీసీ కెమెరా పర్యవేక్షణ, వీఐపీ మార్గాల శుభ్రపరిచే పనులు ప్రారంభించనున్నారు.
సమగ్ర ప్రణాళికకు ఆదేశాలు…
సమావేశంలో మాట్లాడుతూ మంత్రులు జిల్లా అధికారులకు సమన్వయంతో, సమయపాలనతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రూట్ డైవర్షన్‌లు, పార్కింగ్ ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి శాఖ ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పర్యటన జిల్లాకు ప్రతిష్ఠాత్మకం..
ప్రధానమంత్రి మోడీ పర్యటనతో కర్నూలు జిల్లా మరోసారి జాతీయ దృష్టిలో నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడుల ప్రకటనలు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.కర్నూలు మోడీ పర్యటన అధికార యంత్రాంగం ఫుల్ యాక్షన్‌లో.. సర్క్యూట్ హౌస్ సమావేశం నుంచి జిల్లావ్యాప్తంగా ఏర్పాట్ల సన్నాహాలు వేగంగా ప్రారంభమయ్యాయి.
