పాడేరు: అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అల్లూరి జిల్లా వై.రామవరం, జీకేవీధి మండలాల సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది.
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. రెండు ఏకే-47లు స్వాధీనం చేసుకున్నారు. రంగంలోకి దిగిన అదనపు బలగాలు అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం ఎస్పీ అమిత్‌బర్ధర్ ఆదేశాలతో కొద్ది రోజుల నుంచి విస్తృతంగా కూంబింగ్ చేపట్టింది.
.కాగా, వారం రోజుల క్రితం అల్లూరు కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో మార్మోగిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. 15 మంది మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కిట్ బ్యాగులలో కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. కొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయనే అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ను విస్తతం చేశారు.