AP | మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

వ‌ల‌ప‌న్ని..వంశీని ప‌ట్టేశారు
త‌ప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే
హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గంలో హైడ్రామా
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీల‌క నిందితుడు
కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
సెల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తింపు
విజయవాడ, గన్నవరంలో టెన్షన్ టెన్షన్
అరెస్టుపై వైసీపీ నేత‌ల‌ గరం గరం..
ముంద‌స్తుగా అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు
కృష్ణాజిల్లాలో 144 సెక్షన్ అమలు

న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: సెన్సషనల్ నేత వల్లభనేని వంశీ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గురువారం ఉదయం ఏపీ పోలీసులు కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్‌ చేసి గచ్చిబౌలి నుంచి ఔటర్‌ మీదుగా విజయవాడ తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోప‌ణలున్నాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్‌ ఫిర్యాదు మేరకు కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద వంశీని పోలీసులు అరెస్టు చేశారు.

ప‌లు కేసుల్లో కీల‌క నిందితుడు..

వంశీని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసు ఇచ్చారు. వల్లభనేనిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద కేసులు నమోదయ్యాయి. వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ 71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు.

పట్టించిన సెల్ డేటా, సీసీ కెమెరా పుటేజీ..

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాల యంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై కేసు నమోదైంది. పార్టీ కార్యాల యంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న తీర్పు రానుంది. ఈ సమయంలోనే నాలుగు రోజుల కిందట సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు… కావాలని పోలీసులే బలవంతంగా సాక్షి సంతకం పెట్టించారని పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్‌ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా వంశీ భయపెట్టారని పోలీసులు గుర్తిచారు. సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సెల్‌ఫోన్‌ సీడీఆర్ .. ఆడియోలు పోలీసులకు దొరికాయి. సత్యవర్ధన్ ను కులం పేరుతో బెదిరించి.. కిడ్నాప్ పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచ రులు కారులో కోర్టుకు తీసుకువచ్చినట్లు సీసీ ఫుటేజీ లో గుర్తించారు. దీంతో వంశీ సహా మరో అయిదుగురిపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుతో ఇక వంశీ అరెస్టు అనివార్య మైంది.

హైద‌రాబాద్‌లో హైడ్రామా..

ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన విజయవాడ పటమట పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో రాయదుర్గంలోని మైహోం భుజాలో అరెస్ట్‌ చేశారు.. అరెస్ట్‌ సందర్భంగా పోలీసులతో వంశీ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందస్తు బెయిల్ కేసు కోర్టులో ఉండగా.. తనను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ పోలీసులతో వాదించారు. ఇది ఆ కేసు కాదు.. మరో కేసు అంటూ.. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. ఇంతలో డ్రెస్ మార్చుకుని వస్తానని తన రూమ్ లో కి వెళ్లిన వంశీ తనను పోలీసులు అరెస్టు చేస్తున్న సమాచారాన్ని పార్టీ కార్యకర్తలు అందించారు. హైదరాబాద్ వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు రామదుర్గం చేరుకున్నారు. ఇక ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకుని హుటాహుటిన ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తరలించారు.

వైసీపీ అగ్గిమీద గుగ్గిలం

వంశీ అరెస్ట్ తో కృష్ణాజిల్లాలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడ, గన్నవరంలో వంశీ అనుచర వర్గం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక వైసీపీ ఈ అరెస్టును ఖండించింది. కూటమి సర్కారు కక్ష సాధింపుచర్యగా అభివర్ణించింది. ఇందులో భాగంగా… మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ లో ఉన్నారని తెలిపింది. ఇటీవల టీడీపీ ఆఫీస్ పై దాడి ఫిర్యాదును సత్యవర్థన్ వెనక్కి తీసుకున్నాడని తెలిపింది. అయినప్పటికీ వంశీని కూటమి నేతలు టార్గెట్ చేశారని.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. ఈ సందర్భంగా… ఈ కక్ష పూరిత రాజకీయాలు ఇంకెన్నాళ్లు చంద్రబాబు అని ఎక్స్ వేదికగా వైసీపీ ప్రశ్నించింది. కృష్ణాజిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ఉద్రిక్త వాతారణాన్ని నివారించే చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృష్ణాజిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు.. తన సిబ్బందిని అలెర్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *