వారసత్వంగా ₹10 లక్షల కోట్ల అప్పు
అమరావతికి పూర్వవైభవం తెస్తాం
గాడిలోపడ్డ పోలవరం–విశాఖ ఉక్కు
వచ్చే నెలలో తల్లికి వందనం ప్రారంభం
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం
మే. జూన్ నెలల్లో మత్స్యకారులకు ₹20వేలు ఇస్తాం
కొత్త గొల్లపాలెంలో పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
బాపట్ల ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంక్షేమం అభివృద్ధి సమానంగా నిర్వహించి, వనరులను వినియోగించి సంపద సృష్టించి, పేదలకు ఖర్చుపెట్టి పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే తన జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రసంగించారు.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త గొల్లపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు రాలేదని, చిన్నగంజాం మండలానికి మూడోసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు విచ్చేశారని ఎమ్మెల్యే సాంబశివరావు కొనియాడారు. బాపట్ల కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ.. గ్రామంలో 996 మంది జనాభా ఉంటే 304 గృహాలు ఉన్నాయని 108 మందికి ప్రతినెల 68వేల రూపాయలు పింఛన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వారసత్వంగా తనకు అప్పు వచ్చిందని , ప్రస్తుతం ఆ ఆప్పు ₹10 లక్షల కోట్లని స్పష్టం చేశారు. అప్పులకు వడ్డీలు చెల్లించే బాధ్యత కూడా తనపై ఉందన్నారు. అయినా సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తామన్నారు.

పేదరికం లేని సమాజమే లక్ష్యం
‘‘ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లను లెక్కకట్టి అమలు చేస్తున్నాం, దివ్యాంగులకు ₹ 6 వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి ₹33,100 కోట్లు ఖర్చవుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు ₹2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని లబ్ధిదారులు 93,300 మంది ఉన్నారు. మిగుల్చుకోవాలంటే నెలకు ₹76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా ₹ 76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
వచ్చే నెల లో తల్లికి వందనం..
తల్లికి వందనం మేలో ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం మంజూరు చేస్తామని సీఎం అన్నారు. ఇక నుంచి నాలుగు నెలలకి ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాం.. మే, జూన్ లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 20 వేలు ఇస్తామని వెల్లడించారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారు అని సీఎం ప్రశంసలు కురిపించారు. ఇక, మనకంటే ధనికమైన రాష్ట్రం తెలంగాణలో మనకంటే తక్కువ పింఛన్ ఉందన్నారు.. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానో విమర్శించే వాళ్లు కళ్లుండి చూడాలన్నారు.
అమరావతిని గాడిలో పెట్టాం
అమరావతి రాజధాని ని గాడిలో పెట్టాం.. 3,4 సంవత్సరాల్లో అమరావతి కి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027కి పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.. విశాఖ ఉక్కుని దివాళా తీయించారని ఫైర్ అయ్యారు.. కానీ, విశాఖ ఉక్కుకి 11 వేల కోట్లు నిధులు తీసుకువచ్చాం.. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడింది.. విశాఖ కి రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు.. గతంలో రోడ్లు గుంతల మయంగా మారాయి.. హాస్పిటల్ కి వెళ్ళాలంటే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉండేదన్నారు.. ఇక, ఈ నెలలోనే డీఎస్సీ పూర్తి చేసి స్కూల్స్ ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను నియమిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కళ్లున్న వాళ్లకే తెలుస్తుంది
సంక్షేమం ఇవ్వలేదనే వాళ్లు కళ్లు ఉంటే చూడాలి. మనసుంటే మాట్లాడాలి అన్నారు చంద్రబాబు. మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అడిగితే మనం ఇచ్చే పింఛన్ల సంగతి చెప్పండి.. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నాం.. అమరావతి రాజధాని వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.. అమరావతిని మరో మూడేళ్లలో గాడికి పెడతాం.. అమరావతికి పూర్వవైభవం తెస్తాం.. నదుల అనుసంధానం చేయాలని పోలవరాన్ని గాడిలో పెడుతున్నాం.. వ్యవసాయం సజావుగా సాగుతుందన్నారు.. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని పోరాడాం.. జనసేన, బీజేపీ నేతలతో కలసి మాట్లాడాం.. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడింది.. ఇలా పరిపాలన సమర్థవంతంగా చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది.. విశాఖ రైల్వే జోన్ వచ్చింది.. రోడ్లు మొత్తం బాగుచేసాం.. భవిష్యత్తులో రోడ్లు అద్దంలా చేస్తాం.. పిల్లల ఉద్యోగాల కోసం మెగా డీఎస్సీ.. స్కూల్ ఓపెన్ అయ్యే లోపు కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకుంటాం.. చేనేత కార్మికులు, వడ్డెర, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు కోసం ఏం చేస్తే జీవితాలు బాగుపడతాయో ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.