కర్నూలు | ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు ఇవాళ ఉదయం 11:55లకు సీక్యాంపు రైతుబజార్‌కు వెళ్లనున్నారు. రైతు బజార్‌ను పరిశీలించి, రైతులతో చంద్రబాబు మాట్లాడతారు. రైతులతో మాట్లాడి ఆయా సమస్యల గురించి తెలుసుకుంటారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను సీఎం ఆదేశించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధనలక్ష్మి నగర్ పార్కులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు గుర్తుగా పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రీయ విద్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. అలాగే పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఈ సమావేశంలో నేతలకు ఆయా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కర్నూలులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు పలు ఆంక్షలు విధించారు