AP | ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం.. ఫ్రిజ్‌లో అవశేషాలు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం గాజువాకలో యువతి మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చెప్పిన వివరాలు, దర్యాప్తులో బయటపడుతున్న ఆధారాలు కేసుకు కొత్త మలుపు తీసుకొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గాజువాక నగరంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతల రవీంద్ర గత నెల 29న హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య అనంతరం అతడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
మొదట మౌనికను కీర్తి ఎన్క్లేవ్‌లో హత్య చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు అదే ఆధారంగా కేసు నమోదు చేశారు. అయితే సీసీటీవీ దృశ్యాల్లో మౌనిక ఆ అపార్ట్ మెంట్ కు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడి అపార్ట్ మెంట్ లో ఎవరూ లేని సమయంలో మౌనికను అక్కడికి తీసుకెళ్లి హత్య చేసినట్లు రవీంద్ర ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, ఆవేశంలో మౌనిక నోరు, ముక్కు మూసి ప్రాణాలు తీశాడని వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ముక్కలుగా నరికి, కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో, మరికొన్నింటిని మంచం కింద దాచినట్లు సమాచారం. తల, చేతులను వేరుగా తీసుకెళ్లి జనసంచారం లేని ప్రాంతంలో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో, అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగా, చివరకు నిందితుడు లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో రవీంద్ర ఒక్కడేనా లేదా మరెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చిందని నిందితుడు చెప్పిన నేపథ్యంలో ఆ వాదనలో నిజానిజాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
