AP | అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 60 రోజులు జరగాలి : స్పీకర్ అయ్యన్న పాత్రుడు

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏడాది లో 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వాహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. లోక్ సభ స్పీకర్ సూచనల మేరకు వచ్చే సెప్టెంబర్ 14, 15వ తేదీలలో తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయిలో పార్లమెంట్, అసెంబ్లీలలోని మహిళా సాధికారిత కమిటీల సభ్యుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిడానికి వచ్చిన అయ్యన్న పాత్రుడు, సమావేశం అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆయన దేశంలోని 31 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు, పార్లమెంట్ కు చెందిన మహిళా సాధికార కమిటీల సభ్యులు ఆ సమావేశానికి వస్తారని చెప్పారు. లోక్ సభ స్పీకర్ కోరిక మేరకు ఆ సమావేశాన్ని తిరుపతి లో నిర్వహించ తలపెట్టామన్నారు.. అసెంబ్లీ సమావేశాలు కొన్ని రోజులకు, చర్చలు కొన్ని గంటలకు పరిమితం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒకప్పుడు ఉదయం నుంచి తెల్లవారు ఝాము వరకు అర్ధవంతంగా చర్చలతో జరిగేవని గుర్తు చేసారు.

కనీసం వారం రోజులు పాటు కాకుండా సంవత్సరానికి అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు పాటు జరగాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం జరిగే అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇటీవలి జాతీయ స్థాయి స్పీకర్ల సమావేశం లో ప్రస్థావించామని చెప్పారు.

వచ్చే సెప్టెంబర్ లో తిరుపతిలో జరిగే మహిళా సాధికారత సమావేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఐదారు మంది సభ్యులు హాజరు అవుతారని తెలిపారు. వీరందరూ కూడా రెండు రోజులు వారి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి ఆ రిపోర్టుని పార్లమెంట్, అసెంబ్లీ ద్వారా గాని చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం అనంతరం కాన్ఫరెన్స్ కు హాజరైన వారు శ్రీకాళహస్తి దైవ దర్శనం, శ్రీసిటీ, శ్రీహరికోట వంటి ప్రదేశాలలో సందర్శించడం జరుగుతుందని తెలిపారు.

ఆ తర్వాత రఘురామ కృష్ణ రాజు మాట్లాడుతూ, మహిళా సంక్షేమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఆ సమావేశానికి వేదిక కావడం సముచితంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సన్నాహక ఏర్పాట్ల తొలి సమావేశం లో రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓ ఎస్ డి, పెట్టన్న చౌదరి, టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, టిటిడి ఈ.ఓ. శ్యామల రావు, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక కమీషనర్ ఎన్.మౌర్య పాల్గొన్నారు.

Leave a Reply