- భూ కేటాయింపు నిర్ణయాలకు ఆమోదం
అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ 50వ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కనీసం 10 వేల ఎకరాలు అవసరంవుతుందని తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు భూ సేకరణకు బదులుగా భూ సమీకరణ విధానాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.
ఇప్పటికీ తుళ్లూరు మండలంలోని 3 గ్రామాలు, అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో రైతులు మొత్తం 20,494 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని ఆయన చెప్పారు.
అమరావతిలో ఇటీవల సీఆర్డీఏ ఆథారిటీ ఆమోదించిన కీలక అభివృద్ధి నిర్ణయాలు:
🔸హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ & మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు
మందడం, రాయపూడి, పిచ్చుకలపాలెం గ్రామాల్లో కలిపి 58 ఎకరాల స్థలంలో హైడెన్సిటీ నివాస ప్రాంతాలు, మిశ్రమ అభివృద్ధి (Mixed-use) ప్రాజెక్టుల కోసం RFP (Request for Proposal) ద్వారా ప్రణాళికలు రూపొందించేందుకు ఆమోదం ఇచ్చారు.
🔸ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల ప్రణాళిక
అమరావతిలో నిర్మించబోయే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించేందుకు CRDA ప్రతిపాదనకు ఆథారిటీ ఆమోదం తెలిపింది.
🔸నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లు – QBS విధానంలో
మందడం, తుళ్లూరు, లింగాయపాలెం గ్రామాల్లో ఒక్కోటి 2.5 ఎకరాల చొప్పున నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి QBS (Quality-Based Selection) విధానంలో అనుమతి ఇచ్చారు.
🔸భూముల సమీకరణ (Land Pooling) – 20,494 ఎకరాలు
అమరావతి మండలంలోని నాలుగు గ్రామాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు ఆమోదం.
🔸ఇసుక తవ్వకానికి అనుమతి
రాజధాని నిర్మాణ పనుల కోసం అవసరమైన ఇసుకను పొందేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిలేషన్ (desiltation) ద్వారా తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని
అంచనా
🔸ప్రముఖ సంస్థలకు భూ కేటాయింపు – మొత్తం 65 ఎకరాలు
సీబీఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా మొత్తం 16 సంస్థలకు 65 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
🔸ఈ-15 రహదారిపై 6 లైన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం
రాజధానిలో ఈ-15 రహదారిపై 6 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు.
🔸తెలుగు వీరుల స్మారక చిహ్నాలకు స్థలం కేటాయింపు
పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నాల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.
అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మూడేళ్లలో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.