పేదవాడి సొంతింటి కల సాకారం..

పేదవాడి సొంతింటి కల సాకారం..
జిల్లాలో ఘనంగా గృహప్రవేశాలు.
పాల్గొన్న మంత్రి టీ.జీ. భరత్ .
లబ్ధిదారుల ఆనందోత్సాహం.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 2.50 లక్షల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా సోమవారం కర్నూలు నగర పరిధిలోని జోహారాపురంలో నిర్వహించిన గృహప్రవేశ వేడుకలో మంత్రి పాల్గొన్నారు. నజీబున్నిసా బేగం, షేక్ గౌస్ బాషా నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి లబ్ధిదారులకు సంప్రదాయబద్ధంగా కొత్త బట్టలు బహూకరించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి, గతంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులను, ప్రస్తుతం సొంతింటి సంతోషాన్ని ఆరా తీశారు.

మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పేదలకు గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పి ఎం ఏ వై) పథకం ద్వారా అర్హులకు రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘పురసేవ’ యాప్‌ను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ యాప్ ద్వారా నమోదు చేసిన ఫిర్యాదులు నేరుగా ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుకు చేరుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర..2047 లక్ష్యాల్లో భాగంగా ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ సంకల్పమన్నారు. జిల్లాలో ఇంకా 17 వేల మందికి ఇళ్ల స్థలాల అవసరం ఉందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.

పి ఎం ఏ వై 2.0 అర్బన్ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి సొంత స్థలం కలిగిన వారికి రూ.2.50 లక్షల సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,600 ఇళ్లు మంజూరవగా, అందులో 1,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పనులను అక్టోబర్‌లోపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
పీఎం ఏవై గ్రామీణ పథకం కింద 30 వేల మంది అర్హులుగా గుర్తించబడగా, ఒక్కో యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గతంలో పి ఎం ఏ వై 1.0 కింద మంజూరైన 53 వేల ఇళ్లలో 30 వేలు పూర్తయ్యాయని, మిగిలిన 20 వేలు ఇళ్లను సెప్టెంబర్ 2026లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఎస్సీ, బీసీ ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.50వేల నుంచి రూ.70 వేల వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు కర్నూలు నగరంలోని శరీన్ నగర్‌లో నాగన్న, లక్ష్మీదేవి ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేరింది- నజీబున్నిసా బేగం:
“ముందు అద్దె ఇల్లు కోసం నెలనెలా కష్టపడేవాళ్లం. ఇప్పుడు సొంత ఇల్లు రావడం మా కుటుంబానికి పెద్ద వరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన సహాయం వల్లే ఈ రోజు గృహప్రవేశం చేసుకున్నాం. ఎంతో ఆనందంగా ఉంది.”

ప్రభుత్వం మా కలగా నెరవేర్చింది
షేక్ గౌస్ బాషా:
“సచివాలయంలో దరఖాస్తు చేసిన వెంటనే మాకు ఇల్లు మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం పూర్తి చేసి ఈ రోజు మా సొంతింట్లో అడుగు పెట్టడం జీవితంలో మర్చిపోలేని క్షణం. ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.”
