ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు

ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు
కౌతాళం, ఆంధ్రప్రభ : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం ఓ కుటుంబాన్ని చిద్రముచేసింది. కన్నతండ్రినే తనయుడు దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన నానేసాబ్ రెండో భార్య గర్భవతిగా ఉండటంతో పుట్టబోయే శిశువుకు ఆస్తిలో వాటా దక్కుతుందనే అనుమానం మొదటి భార్య కుమారుడు నూర్ సాబ్‌లో పెరిగింది.
ఈ నేపథ్యంలో కుటుంబంలో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తగా, ఆవేశానికి లోనైన నూర్ సాబ్ కత్తితో తన తండ్రి నానేసాబ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన నానేసాబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నూర్ సాబ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చగా, ఆస్తి వివాదాలు కుటుంబాలను ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

