AP | ప్రజా సమస్యలపై తక్షణ స్పందన..

AP | ప్రజా సమస్యలపై తక్షణ స్పందన..
- అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
- కోకిలంపాడులో రూ. 17 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన
AP | తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో రూ.17 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గ్రామాభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు ఉండటంతో చిన్నారులు, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు వివరించగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం డ్రైనేజీ సమస్యల కారణంగా ఇబ్బందికరంగా మారిన గ్రామ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామంలోని అన్ని మౌలిక సదుపాయ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇటీవల నిర్మించిన రెండు మినీ గోకులం షెడ్డులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు.
పశుపోషణ, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి గోకులం షెడ్డులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, గోకులం షెడ్డుల కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
