మహిళా స్వయం ఉపాధికి తోడ్పాటు..

మహిళా స్వయం ఉపాధికి తోడ్పాటు..
ఎంపీ కేసినేని శివనాథ్
మహిళలకు వంద కుట్టుమిషన్లు పంపిణీ..
ఆంధ్రప్రభ, పటమట : పేద మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో తూర్పు నియోజకవర్గంలో 100 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. నగరంలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ , తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ , తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తానా ట్రెజరర్ కాసుకుర్తి రాజా ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు సూచిస్తుంటారని తెలిపారు. అదే ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలకు ఆదాయం సంపాదించేలా కుట్టుమిషన్లు దోహదపడతాయని ఆయన అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం “స్వయం” పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. మహిళల సాధికారతకు డ్వాక్రా సంఘాల ఏర్పాటు కీలకమైందని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
