AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…

AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…
- వచ్చే భక్తులకు అన్ని సేవలకు అధికారులు అప్రమత్తం..
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు శ్రీశైలానికి తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను ఆమె స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శివరాత్రి రోజున సుమారు 20 గంటల వ్యవధిలో భక్తులు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే విధంగా సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అర్థగంట వ్యవధిలోనే శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం లో స్వామివారి, అమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకునేలా క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ వ్యవస్థలను సమర్థవంతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. దర్శనం అనంతరం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం రోజున దాదాపు 80 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి ప్రసాదం, దేవస్థాన భోజన వసతి అందించి సాఫీగా నిర్వహించగలిగామని కలెక్టర్ వివరించారు.

బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు భక్తులు ఇదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే దృష్ట్యా టోల్ గేట్ రుసుము మినహాయింపు, రాత్రి వేళల్లో ప్రయాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.అటవీ మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం 13 ప్రాంతాల్లో త్రాగునీరు, అన్నదానం, వైద్య సేవలు, చలువ పందిళ్లు తదితర సదుపాయాలతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీ మార్గంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు 7 అంబులెన్సులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అవసరమైతే స్ట్రెచర్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించే చర్యలు కూడా చేపట్టినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో ప్రయాణించే భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ శివనామస్మరణతో దర్శనం పూర్తి చేసుకుని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
