AP | అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..!

AP | అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..!
చిన్నారుల పోషణ, అభివృద్ధిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ కఠిన సమీక్ష
AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీ సేవల అమలు, చిన్నారుల పోషణ స్థితిగతులపై నేరుగా పర్యవేక్షణకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆకస్మికంగా రంగంలోకి దిగారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని బ్రాహ్మణపల్లి–2 (1213323) అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం సడెన్‌గా తనిఖీ చేసి, సేవల నిర్వహణపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.ప్రీ-స్కూల్‌కు హాజరైన 8 మంది చిన్నారులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, పిల్లల బరువు, ఎత్తు వివరాలను సవివరంగా పరిశీలించారు. వయస్సుకు తగ్గ ఎత్తు లేని పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి పెరుగుదలకు అవసరమైన కార్యాచరణలు వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పోషణ ట్రాకర్ యాప్‌లో నమోదు చేసిన గ్రోత్ చార్ట్‌లను పరిశీలించి, డేటా నమోదు ఖచ్చితత్వంపై కూడా దృష్టి సారించారు. కేంద్రంలో అందిస్తున్న ప్రీ-స్కూల్ మెనూ, పిల్లలకు అందిస్తున్న ఉడికించిన గుడ్ల నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించడం విశేషం. గుడ్ల రంగు, పరిమాణాన్ని తనిఖీ చేసి, ఆహారం నాణ్యతపై పిల్లలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇక ప్రీ-స్కూల్ కార్యక్రమాలను సమీక్షిస్తూ చిన్నారులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారికి ఉత్సాహం నింపారు. త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశిస్తూ పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
జిల్లాలో అంగన్వాడీ సేవల అమలు మరింత మెరుగుపడేలా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
