AP | చేనేత, హస్తకళ ప్రదర్శనను ప్రారంభం..

AP | చేనేత, హస్తకళ ప్రదర్శనను ప్రారంభం..
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
AP | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన హస్తకళ–చేనేత వస్త్ర ప్రదర్శనను బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వివిధ ప్రాంతాల చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు, సంప్రదాయ హస్తకళ ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారమని తెలిపారు. చేనేత కార్మికులు తమ కళను నిలబెట్టుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వం తోడ్పాటుతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.
స్థానికంగా తయారయ్యే హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసి కార్మికులకు చేయూతనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో యంత్రాలతో తయారయ్యే వస్త్రాలకు పోటీగా చేనేత ఉత్పత్తులు నిలవాలంటే ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. హస్తకళల పరిరక్షణ ద్వారా సంప్రదాయాలు కొనసాగుతాయని, తద్వారా కార్మికుల జీవనోపాధి మరింత బలపడుతుందని అన్నారు. ఈ ప్రదర్శనను ప్రజలు సందర్శించి చేనేత కార్మికులకు మద్దతు తెలపాలని కోరారు.
