జడ్చర్ల, ఆంధ్రప్రభ : జడ్చర్ల పురపాలక పట్టణ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు బడానేతలు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారని, బాదేపల్లి శివారులోని సర్వే నెంబర్ 140లో 940 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేశారని ఆంధ్రప్రభ దినపత్రికలో గత కొన్ని రోజులుగా పురపాలిక కార్యాలయంలో జరుగుతున్న అనేక లోగుట్టు వ్యవహారాలపై వస్తున్న వార్తలకు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్ పర్సన్ కోనేటి పుష్పలత ఎట్టకేలకు స్పందించారు.
ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పక్షం రోజులుగా ఆంధ్రప్రభ దినపత్రికలో వస్తున్న కథనాలపై స్పందించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డింగ్ యజమానులకు ఇప్పటికే నోటీసులు అందజేశామని, ఈరోజు పట్టణంలోని సరస్వతీ నగర్ కాలనీల్లో అన్యాక్రాంతానికి గురైన పార్కులను గుర్తించేందుకు చర్యలు మొదలు పెట్టామని కమిషనర్ అన్నారు. మున్సిపల్ పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో పార్కు స్థలాలను కబ్జాకు గురైన విషయాలు ఇప్పుడిప్పుడే తమ దృష్టికి వస్తున్నాయని, ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి, వాటిని పరిరక్షించేందుకు అవసరమైన సూచిక బోర్డులను, కంచె, ప్రహరిగోడలు సైతం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
పట్టణంలో ఎక్కడ ఎలాంటి అవినీతి చర్యలు జరిగినా ఎవరినీ ఉపేక్షించేది లేదని, 10% పార్కు స్థలాలు కబ్జాకు గురైతే వాటి వివరాలు తమకు అందజేయాలన్నారు. రహదారులపై ఇష్టానుసారంగా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సారిక రామ్మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్ రెడ్డి, శశికిరణ్, సతీష్, రఘురాం గౌడ్, టీపీఓ అధికారిణి మేఘన, శానిటేషన్ ఇన్ స్పెక్టర్ నాగేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.