హైదరాబాద్,ఆంధ్రప్రభ : తెలంగాణలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024-25 కి సంబంధించి తెలంగాణ ఫేజ్- 4 పులుల మానిటరింగ్‌లో పులుల సంఖ్య 33 నుంచి 36 కి చేరుకున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. పులుల పెరుగుదల ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించింది.
నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ప్రోటోకాల్ ప్రకారం 10 ఫారెస్ట్ రేంజ్‌లను 5 బ్లాక్‌లుగా విభజించి గత డిసెంబర్ 20 నుంచి మే 15 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులుల గణన నిర్వహించామని తెలిపింది. ఈ గణనలో మొత్తం 36 పులులను గుర్తించామని.. వీటిలో 13 మగ పులులు, 20 ఆడ, 2 చిన్న పిల్లలు, ఒకటి గుర్తించని పులి ఉన్నట్లు తెలిపింది.
పులులను గుర్తించేందుకు 1,594 కెమరాలను వినియోగించినట్లు అటవీశాఖ పేర్కొన్నది. 2023-24లో 33 పులులు ఉండగా, ఈ సంఖ్య ఏడాదిలో 36 కి చేరిందని తెలిపింది. టైగర్ ప్రాజెక్టు కింద తమ శాఖ చేపట్టిన పరిరక్షణ చర్యలు, సిబ్బంది అంకితభావం, స్థానిక ప్రజల సహకారం తదితర కారణాలతో పులుల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ తెలిపింది.