అమెరికాకే నష్టం

అగ్రరాజ్యాధినేత..అతడి అడుగులు..ఆలోచనలు…అమలు పరిచే విధానాలు…అన్నీ ఎలా ఉండాలి? అత్యున్నత స్థాయిలో ఉండాలి కదా…అందుకు విరుద్ధంగా అగ్రరాజ్యాన్ని అధమ స్థితిలోకి తీసుకెళ్ళేలా ఉంటోంది. ఇది సాక్షాత్తూ అతడిని ఎన్నుకున్న అమెరికన్ల మనోగతమే. అన్నిటి కంటే ముఖ్యంగా టారిఫ్ ల (Tariffs) తో ప్రపంచ దేశాలపై విరుచుకు పడుతూ మిత్రదేశాలనూ వదలని ట్రంప్ వైఖరి (Trump’s stance) విచిత్రంగా ఉంటోంది. ఇది ప్రపంచ దేశాలకన్నా అమెరికన్లకే అంతిమంగా నష్టం చేస్తుందని లబోదిబోమంటున్నారు ఆ దేశప్రజలు.

ఆమాటకొస్తే ట్రంప్ కఠిన విధానాలన్నీ అమెరికాకే నష్టం కలిగిస్తాయని స్పష్టమవుతూనే ఉంది. ప్రపంచ దేశాలతో అన్నిరకాల సంబంధాలనూ తెంపేసుకోవడం దౌత్య పరంగా పెద్ద ఫెయిల్యూర్ (Failure) అవుతుంది. ఇతర దేశాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి రాకపోతే యూనివర్శిటీలు వెలవెలబోతాయి. దిగుమతులు తగ్గిపోతే వస్తువులు లభించక ధరలు పెరుగుతాయి. తక్షణమే ప్రత్యామ్నాయం దొరకదు.

టారిఫ్ లు పెంచేస్తే ప్రపంచ దేశాలు భయపడిపోయి దారిలోకొస్తాయని అనుకోవడం కేవలం ట్రంప్ భ్రమ మాత్రమేనని భారత్ విషయంలో రుజువైంది. భయపడడం కాదు కదా భారతదేశ ప్రధాని మోడీ (Prime Minister Modi) కనీసం స్పందించడం కూడా చేయకుండా, ప్రత్యామ్నాయ అవకాశాల వైపు వేగంగా అడుగులు వేస్తూ, రష్యా, చైనాలతో స్నేహానికి వేగంగా పావులు కదుపుతూ…పాత మిత్రులను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఇదే ట్రంపు గారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది…ఇటు భారత్ (India) పైనా, అటు భారత్ కు అండగా ఉంటోన్న మిత్ర దేశాలైన రష్యా, చైనాల పైనా అక్కసు వెళ్ళగక్కుతున్నారు…లోలోపల భోరుమంటున్నాడు. మధ్యలో తన నోబెల్ బహుమతి (Nobel Prize) గొడవొకటి… దానికి సిఫార్సు చేయలేదని భారత్ పై అక్కసు పెంచుకోవడమూ కారణమే అనేది బహిరంగ రహస్యం..

ఇప్పుడు భోరుమన్నా…పొర్లి పొర్లి ఏడ్చినా భారత్ తో రష్యా, చైనాల (Russia and China) స్నేహ బాంధవ్యాలు, వాణిజ్య ఒప్పందాలూ, పరస్పర ప్రపంచ సహకారాలూ ఆగవు. ప్రపంచ దేశాలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార-వాణిజ్యాల్లో ఒక్కసారి ప్రత్యామ్నాయం వెతుక్కుంటే తిరిగి వారిని తమవైపునకు తిప్పుకోవడం అమెరికాకు చాలా కష్టమైన ప్రక్రియ…అది ట్రంప్ కైనా సరే, అధికారంలోకొచ్చే మరెవరికైనా సరే.

Leave a Reply