America | మోడీకి పెద్దన్న షాక్ – భారీ ఆర్థిక సాయం నిలిపివేత

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్‌లో వోటరు శాతం పెంపుదలకు ఇప్పటి వరకు అందజేస్తున్న 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 182 కోట్లు) సాయాన్ని నిలిపివేశారు.

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘ప్రభుత్వ సామర్థ విభాగం’ (డిఒజిఇ డోజ్) తాజాగా ఈ ప్రకటన చేసింది. ట్రంప్ క్రితం నెల డోజ్‌కు సారథిగా మస్క్‌ను ఎంపిక చేశారు. పాలన మెరుగుదల, వృథా ఖర్చుల కట్టడి బాధ్యత చేపట్టిన డోజ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఈ కోతలు ప్రకటించింది.

అదే విధంగా బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేసే లక్షంతో అమెరికా కేటాయిస్తున్న 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 251 కోట్లు) సాయాన్ని కూడా డోజ్ నిలిపివేసింది. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే డోజ్ ఈ నిర్ణయం తీసుకున్నది.

భారత్, బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో అమెరికా ఇప్పటి వరకు ఈ గ్రాంట్ అందజేస్తోంది.డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

స్పేస్ ఎక్స్ సిఇఒ మస్క్ కూడా ఇటీవల తన ముగ్గురు పిల్లలతో సహా తన కుటుంబంతో కలసి మోడీతో భేటీ అయ్యారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇంధన శక్తి రంగాల్లో అవకాశాలపై ఉభయులూ చర్చించుకున్నారు. భారత్, యుఎస్‌లలో సుపరిపాలనకు కృషిపై వారు పత్రాలు మార్చుకున్నారు

. కాగా, బడ్జెట్‌లో కోతలు లేకపోతే అమెరికా దివాలా తీస్తుందని మస్క్ ఇటీవల పలు మార్లు నొక్కి చెప్పారు. ఇప్పుడు బడ్జెట్‌లో కోత విధించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్‌లకు అందజేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *