Aler | శ్రీ రంగనాథ కళ్యాణం..

Aler | శ్రీ రంగనాథ కళ్యాణం..

Aler, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని అపర శ్రీరంగంగా, విఖ్యాత వైష్ణవ క్షేత్రంగా పేరొందిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం ఉత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. అందంగా అమర్చిన రమణీయమైన కళ్యాణ వేదిక మీద ఉత్సవమూర్తులైన శ్రీ గోదా రంగనాథులకు కళ్యాణం జరిగింది. ప్రముఖ వేద పండితులు మోటుపల్లి పవనకుమారాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించగా ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు వేదమంత్రోచ్ఛారణలు జరిపారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం గోవింద నామస్మరణ మధ్య కళ్యాణోత్సవాన్ని చూసి తరించారు. చూడముచ్చటగా.. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకకు పవనకుమారాచార్యులు అందించిన వేద వ్యాఖ్యానం భక్తులను ఎంతగానో అలరించింది. పలువురు స్థానిక ప్రముఖులు పెండ్లి కుమారుడు, కుమార్తె అయిన గోదారంగనాధుల పక్షాన కూర్చుని కళ్యాణోత్సవాన్ని నిర్వహింపజేశారు. శ్రీ గోదా కళ్యాణ వృత్తాంతంతో ఆధ్యాత్మిక సాంస్కృతిక నృత్య విభావరి జరిగింది. ఆలయ చైర్మన్ మోర్తాల గోపాల్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply