గ్యాస్ కోసం పడిగాపులు…మాకేంటి ఈ తిప్పలు!!

గ్యాస్ కోసం పడిగాపులు…మాకేంటి ఈ తిప్పలు!!
దేవాలయాలకూ ఇవ్వని వైనం…
బుక్ చేసి 15 రోజులు దాటినా సరఫరా కాని వైనం..
సరఫరా,సాంకేతిక సమస్యలపై కొరవడిన స్పందన…
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఇంటి వంట గ్యాస్ కోసం గంపలగూడెం హెచ్.పి గ్యాస్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుండి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం వంట గ్యాస్‌పై గత కొన్ని రోజుల నుండి తీవ్ర ప్రభావం చూపుతోంది. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి 15 రోజులు దాటినా సరఫరా కావడం లేదు. గత పది రోజుల నుండి గ్యాస్ బండ ఆటో గ్రామాల్లోకి రావడం లేదు. దీనితో రీఫిల్ బుక్ చేసుకున్న వారు ఎప్పుడు వస్తుందా ఆటో అని ఎదురుచూస్తున్నారు.
మాకేంటి ఈ తిప్పలు అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఎన్ని రోజులకూ సిలిండర్ ఆటో గ్రామాలకు రాకపోవడంతో 20-25 కిలోమీటర్లు ప్రయాణిస్తూ స్థానిక దుర్గా గ్యాస్ ఏజెన్సీకు తరలివస్తున్నారు. అసలే వేసవి ఉష్ణోగ్రతలతో మండుటెండ ఉన్నా ఇబ్బందులు పడుతూ బారులు తీరారు. ప్రత్యేకంగా గ్రామాల నుండి ఆటో కిరాయికి తీసుకుని గ్యాస్ బండల కోసం బుకింగ్ చేసుకుని ఓటిపి కోడ్ తో వస్తున్నారు.అయినా వారికి కూడా బండ అందడం లేదు.ఉన్నత స్థాయి అధికారులు గ్యాస్ కొరత లేదు, ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది.
కొరత లేనప్పుడు ఎప్పటిలా గ్యాస్ ఆటో గ్రామాలకు ఎందుకు రావడం లేదు??బుకింగ్ చేసుకుని ఓటిపి వస్తున్నా బండ ఎందుకు ఇవ్వడం లేదు?? అని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చమురు కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా పూర్తిగా ఆపేశారు. ఇక ఇంటి వంట సిలిండర్లను సరాసరి చేసి పొదుపుగా పంపుతున్నారు. అవి వినియోగదారుల తాకిడికి సరిపోవడం లేదు.
దీనితో ఏజెన్సీ నిర్వాహకులు చేసేది ఏమీ చేతులెత్తేశారు. అధికారులు కూడా క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు.ఆన్లైన్ లో బుకింగ్,పేమెంట్ చేసి ఓటిపి వచ్చినా ఏజెన్సీ సిస్టం లో అప్డేట్ కాకపోవడం మరింత గందరగోళంగా ఉంది. దీనితో ఏజెన్సీ నిర్వాహకులు మాకు పేమెంట్ రాలేదు, బండ ఇవ్వము అని చెప్తున్నారు. సరఫరా సమస్యలు,సాంకేతిక సమస్యలు ఉన్నా అధికారులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లకపోవడంతో సమస్య సమస్యగానే ఉంటుంది.
అదేవిధంగా విద్యాలయాలు, అంగన్వాడీలు, దేవాలయాలు, వైద్యశాలలకు గ్యాస్ సిలిండర్ సరఫరా ఆపవద్దని ప్రభుత్వం చెప్తున్నా అమలు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంది.శ్రీరామనవమి సందర్భంగా దేవాలయాల్లో జరిగే అన్నప్రసాద కార్యక్రమాలకూ ఈ గ్యాస్ కొరత తాకింది. ఆలయాల నిర్వాహకులు అన్నప్రసాద కార్యక్రమాలకు మూడు నుండి నాలుగు సిలిండర్లు అవసరం ఉన్నా కొరతను అర్ధం చేసుకుని 80 శాతం వంట కట్టె పుల్లలతో చేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన 20 శాతం వంటకు ఒక సిలిండర్ అయినా అవసరం ఉంది అని ఏజెన్సీకు వస్తే అక్కడా అందక ఇబ్బందులు పడ్డారు. దీనితో ఆలయాలపైనా గ్యాస్ ప్రభావం పడింది.
