Adilabad | వామ్మో.. కోల్డ్ వేవ్..
- మంచు తెరలో ఏజెన్సీ
- ఆదిలాబాద్ అతి శీతలం!
- మళ్లీ సింగల్ డిజిట్‌కు ఉష్ణోగ్రత
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో అడవుల జిల్లా ఆదిలాబాద్ వణికిపోతున్నది. నిన్న, మొన్నటి వరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాగా… ఆదివారం వేకువ జాము నుండి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకొని రహదారులన్నీ అంధకారంగా మారాయి. వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
ఆదిలాబాద్ జిల్లా ఆర్లి-టీలో ఆదివారం ఉదయం 8.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, బజార్హత్నూర్ 8.5, పొచ్చర 8.7, సాత్నాల 8.8, తాంసి 9.1, పిప్పల్ దరి 9.1, బేల 9.1, చెప్రాల 9.1, సోనాల 9.3, లోకారి 9.4, తలమడుగు 9.4, ఆదిలాబాద్ 9.7, బరంపూర్ 9.7, మావల 9.8, నేరడిగొండ 9.9 డిగ్రీలు నమోదయ్యాయి.
ఇక ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యానీ 9.2, సిర్పూర్-యు 9.4, కెరమెరి 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 14 మండలాల్లో సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉట్నూర్ ఏజెనీతో పాటు కొమరం భీం జిల్లాలోని కౌటాల, దహేగాం కాగజ్నగర్, తిర్యాని, వాంకిడి, జై నూర్, భీంపూర్, బేల మండలాల్లో వేకువ జాము నుండే దట్టమైన పొగ మంచు ఆవహించి పొగ మంచుతో విపత్కర వాతావరణం నెలకొన్నది.
నిన్న, మొన్నటి సాధారణ ఉష్ణోగ్రతలు 10 నుండి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలిగాలుల ప్రభావం పెరిగింది. ఉదయం 9 గంటల వరకు మంచు కమ్మేయడంతో ప్రధాన రహదారుల్లో వాహన చోదకులు లైట్లు వేసి వాహనాలు నడపాల్సిన పరిస్థితి నెలకొంది.

కోల్డ్ వేవ్స్‌తో అలర్ట్‌గా ఉండాలి
చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పేర్కొంటు-న్నారు. ఉదయం 9 తర్వాతే బయటకు వెళ్లాలని, రాత్రి వేళల్లో ఉన్ని వస్త్రాలు, రగ్గులు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. చర్మ వ్యాధులతోపాటు ఉబ్బసం, చలి జ్వరం, శ్వాస కోశ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. పిల్లలు , వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా స్వెటర్లు ఉన్ని వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు.

