Adilabad | మహా పూజలతో ఖాందేవుని జాతర ఉత్సవాలు ప్రారంభం

Adilabad | మహా పూజలతో ఖాందేవుని జాతర ఉత్సవాలు ప్రారంభం
- 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన ఆదివాసి ఆడపడుచు
- సంప్రదాయ పూజలతో తొడసం వంశస్తుల మొక్కులు..
Adilabad | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదివాసుల ఆరాధ్య దైవం, తొడసం వంశస్తుల ఇలవేల్పు ఖాందేవ్ జాతర ఉత్సవాలు సంప్రదాయ బద్ధంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. పుష్యమాసం పౌర్ణమి పురస్కరించుకొని నార్నూర్ ఖందేవ్ ఆలయ సన్నిధిలో మహాపూజల క్రతువు తో తులసి వంశీయులు ఉత్సవాలను ప్రారంభించారు. ఖాందేవుడు కొలువై ఉన్న నార్నూర్ మండల కేంద్రంలో ఆదివాసి కటోడాలు, వంశ పెద్దలు సంప్రదాయాల మేరకు మహాఘట్టం పూజలు నిర్వహించి ఆదివాసి బిడ్డలు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఖాందేవుని ఆలయంలో 15 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజు సంస్కృతి, ఆచార వ్యవహారాల మేరకు ఖాందేవుని మహాపూజలకు అంకురార్పణ గావించారు.
- నైవేద్యం సమర్పణగా 2.5 కిలోల నూనె తాగిన ఆడపడుచు..
ఆదివాసుల ఆచారాలు, నియమనిష్టలు, అనాదిగా వస్తున్న పూజా విధానాలు వైవిద్యంగానే ఉంటాయి. తమ ఇలవేల్పు ఖాందేవునికి
నైవేద్యం సమర్పించేందుకు నెలరోజుల ముందు నుండే తులసి వంశస్థులు స్వయంగా సాగుచేసిన నువ్వు పంట నుండి తీసిన నూనెతో నైవేద్యం సమర్పిస్తారు. ఈరోజు పుష్య మాస పౌర్ణమి పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఖండాల, ఖానాపూర్ కు చెందిన తుడసం వంశ ఆడపడుచు దుర్గుబాయి, సుర్పం సక్రు బాయి 2.5 కిలోల నువ్వుల నూనె తాగి నైవేద్య రూపంలో మొక్కులు చెల్లించుకున్నారు.

- ఉత్సవాలకు తరలివస్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తొడసం వంశీయులు
తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్ గడ్ నుంచి తొడసం వంశీయులు తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఖాందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామనికి చెందిన తొడసం వంశీయులు ఆడపడుచు సుర్పం సక్రు బాయి రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొక్కులు చెల్లించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుడసం వంశ పెద్దలు నాగో రావ్, మెస్రం రూపుదేవ్, డాక్టర్ తోడసం చందు, సర్పంచ్ బానోత్ కావేరి గజానన్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, సార్ మేడిలు దుర్గ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
