వృత్తి పరమైన నైపుణ్యాలే మంచి పరిపాలనకు మూలం

వృత్తి పరమైన నైపుణ్యాలే మంచి పరిపాలనకు మూలం

  • నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, ఆంధ్ర ప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనకు కేంద్రబిందువు ప్రజలేనని, అలాంటి ప్రజల మన్ననలు పొందాలంటే అధికారులు తమ బాధ్యతలను మరింత నైపుణ్యంతో, సమర్థతతో నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో బ్యాచ్ గ్రూప్–1 అధికారుల నల్లమల్ల ట్రెక్కింగ్, స్టడీ టూర్ కార్యక్రమాన్ని బుధవారం అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా ప్రజల అవసరాలను అర్థం చేసుకుని స్పందించే దృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. అదే నిజమైన పరిపాలనకు కొలమానం అని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, సమయపాలనతో పాటు స్పష్టమైన సమాచార వ్యవహారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పారదర్శకత, నైతిక విలువలను పాటించడం ద్వారా పరిపాలనపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా వినడం, సానుకూల దృక్పథంతో పరిష్కారాలు చూపడం ద్వారా అధికారుల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలమన్నారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా సేవలు సులభంగా అందేలా వ్యవస్థలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధికారులపై గౌరవం పెరుగుతుందని, అలా సేవ చేసే అధికారులే ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. పరిపాలన ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదని, అది అధికారుల నిరంతర కృషి, నైపుణ్యాభివృద్ధి, సేవాభావం కలయికతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రోగ్రాం డైరెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే అధికారుల నైపుణ్యాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, ఈ పర్యటనను తమ నైపుణ్యాభివృద్ధికి విజయవంతంగా మలుచుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం అక్కమాంబ గృహాలను సందర్శనకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్, గ్రూప్–1 సర్వీస్ అధికారులు (2026 బ్యాచ్–1) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply