Accident | ఘోర ప్రమాదం..
- పాదాచారుల పైకి దూసుకెళ్లినా లారీ..
- ముగ్గురు మృతి.. ఇద్దరు తీవ్రంగా గాయాలు..
- ఇంతియాజ్ అనే వ్యక్తి పరిస్థితి ఆందోళనకరం..
Accident, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి–44 పై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు నగరాన్ని విషాదంలో ముంచేసింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పై నడుస్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటన ఎలా జరిగింది?
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయంలో సూరజ్ గ్రాండ్ హోటల్ సమీపంలోని జాతీయ రహదారి పై పాదాచారుల బృందం రోడ్డు మారుతున్న సందర్భంలో, నియంత్రణ కోల్పోయిన లారీ ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చిందని తెలిసింది. లారీ వేగంగా రావడంతో బాధితులను పలు మీటర్ల దూరం ఈడ్చుకుపోయిందని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చెబుతున్నారు. సంఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడని స్థానికులు పేర్కొన్నారు.
అక్కడిక్కడే చనిపోయారు..
లారీ ఢీకొనడం వల్ల కర్నూల్ నగరంలోని రాజీవ్ నగర్ కు చెందిన రామిరెడ్డి, ఇదే నగర్ కు చెందిన లక్ష్మణులు లారీ ఢీకొట్టిన వెంటనే తీవ్ర గాయాల వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఆర్ గోకుల పాడుకు చెందిన శ్రీనివాసులు చికిత్స పొందుతూ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారి మరణం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.
హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయిన బాధితుడు
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసులు కర్నూలు జీజీహెచ్‌కు తరలించిన గంటల్లోనే వైద్యుల చికిత్స ఫలించక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఇంతియాజ్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని సమాచారం. ప్రమాదంలో మరొక ఇద్దరు పాదాచారులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
పోలీసుల విచారణ కొనసాగుతోంది..
సంఘటనపై కర్నూలు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసు బృందం డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.
ప్రాంతంలో ఉద్రిక్తత.. స్థానికుల ఆగ్రహం
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉదయం వరకు ఉద్రిక్తత నెలకొంది. తరచూ ఈ రహదారి పై జరిగే ప్రమాదాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదాచారుల కోసం జీబ్రా క్రాసింగ్, వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో పర్యవేక్షణను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
పరామర్శకు అధికారుల రాక..
మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రిలో విచారించారు. ప్రమాద బాధితులకు సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

