Accident | చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

Accident | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపు నరేష్ (30) కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నారు. నరేష్ కు ఏడాదిన్నర క్రితమే ప్రస్తుత భిక్కనూర్ సర్పంచ్ కూతురితో వివాహం జరిగింది. అయితే నరేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
కొత్త సంవత్సరం సందర్భంగా కామారెడ్డికి వచ్చిన నరేష్ గుమస్తా కాలనీ నుంచి ఇంటికి వెళ్తుండగా కలెక్టరేట్ సమీపంలోని జయశంకర్ కాలనీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నరేష్ ఒక్కడే ఉన్నాడు. అయితే గత కొద్దిరోజులుగా నరేష్ కారు స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని సమాచారం. రెండు నెలల క్రితం స్టీరింగ్ రిపేర్ చేయించినా సరిగ్గా చేయకపోవడం వల్ల ఇవాళ స్టీరింగ్ గట్టిగా పట్టుకోవడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
