(విజయవాడ, ఆంధ్రప్రభ) : జిల్లాలోని రెవెన్యూ, ఇతర సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని నూతన జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా తెలిపారు. 2017 ఐఎఎస్ కేరళ క్యాడర్ కు చెందిన ఇలక్కియాను జేసీగా నియమిస్తూ తాజాగా సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా సోమవారం ఆమె బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ… ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తాను రాజమండ్రి, కాకినాడలో జేసీగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవవచ్చని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటూ బాధ్యతగా తన విధులను నిర్వహించనున్నట్లు చెప్పారు. జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఇలక్కియాకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.