ఏసీబీకి చిక్కిన అవినీతి చేప..

ఆసిఫాబాద్ / ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతిచేప‌ బయటపడింది. రైస్ మిల్ యజమాని వద్ద పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ (డీఎం) రూ.75 వేల లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం ఈ ఘటన రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద చోటుచేసుకుంది.

అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం..

రైస్ మిల్ నుండి సిఎంఆర్ బియ్యం సరఫరా చేయడంలో నాణ్యత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రతి లారీకి రూ.25 వేల చొప్పున డీఎం నర్సింగరావు డిమాండ్ చేసినట్లు తెలిపారు. బాధితుడు ఈ అవినీతి వేధింపులు తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసి నర్సింగరావును లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.

ఈ కేసులో నర్సింగరావుతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితుడి నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు వసూలు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం సామాన్య ప్రజలను వేధిస్తే వెంటనే 1064 లేదా 9154388963 (అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ) నంబర్‌లకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Leave a Reply