పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు…

పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు…
ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ, ఆంధ్రప్రభ : పేదల ఆరోగ్యానికి సంజీవిని లా ఉన్న ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు లేకపోవడం దురదృష్టకరమని, అదే సమయంలో ప్రభుత్వం వ్యయాలలో అదుపు లేకుండా ఖర్చులు చేస్తున్నదని ఆమె ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలు, కార్యక్రమాల కోసం ఖజానా నిండుగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదల వైద్యానికి మాత్రం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల అప్పులు తీసుకునే ధైర్యం ఉన్న ప్రభుత్వానికి, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లు విడుదల చేయడం ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాలనలో ఆరోగ్యశ్రీ సేవలు పదేపదే నిలిచిపోవడం తీవ్ర వైఫల్యానికి నిదర్శనమని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది అంటూ విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం కోట్లాది పేదల ప్రాణాలను కాపాడిన సంజీవని అని గుర్తుచేశారు.
అలాంటి పథకాన్ని బకాయిల పేరుతో నిర్వీర్యం చేయడం దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే రూ.3 వేల కోట్ల బకాయిలు విడుదల చేసి, ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి వైద్యసేవలను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున అల్టిమేటం జారీ చేశారు.
