మానకొండూరు, ఆంధ్రప్రభ : ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో మానకొండూరు నియోజకవర్గ కేంద్రం ఒక్కసారిగా వేడెక్కింది. రసమయి డౌన్ డౌన్, కవ్వంపల్లి డౌన్ డౌన్ అనే నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది.
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన ఆడియో సందేశం వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మండల కాంగ్రెస్ నాయకులు వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం రసమయి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయితే, రసమయి మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఎడిట్ చేసి మాజీ ఎమ్మెల్యే రసమయిని బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని ఆరోపిస్తూ, మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ధర్నాలను అడ్డుకుని, ఇరు పార్టీల నాయకులను స్టేషన్‌కు తరలించారు.