భారత క్రికెట‌ర్లు ఇక‌పై కొత్త ప‌రీక్ష‌లు పాస్ అవ్వాల్సి ఉంటంది. టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలు మరింత కఠినతరమవుతున్నాయి. ఆటలో వేగం, శక్తి, స్టామినా చూపించాలంటే భారత క్రికెటర్లు ఇకపై కొత్త ఫిట్‌నెస్ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే యో-యో టెస్ట్ ఉండ‌గా.. మైదానంలో మరింత ఫిట్‌గా నిలవాలంటే.. భారత క్రికెటర్లు ఇప్పుడు బ్రోంకో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. రగ్బీ ఆటగాళ్ల కోసం రూపొందించబడిన ఈ టెస్ట్ ఇప్పుడు క్రికెటర్లకు కూడా వర్తించనుంది. మహేంద్ర సింగ్ ధోనీ కాలంలో యో-యో టెస్ట్‌ ప్రాముఖ్యం పెరిగింది.

ఆ తరువాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ సమయంలో ఫిట్‌నెస్ ప్రమాణాలు మరింత కఠినతరం అయ్యాయి. తాజాగా, ప్రధాన కోచ్ గౌతం గంభీర్, కండీషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ ఆధ్వర్యంలో బ్రోంకో టెస్ట్‌ను తీసుకొచ్చారు. దీంతో మైదానంలో మరింత దృఢంగా నిలవాలంటే బ్రోంకో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం క్రికెటర్లకు తప్పనిసరి అవుతోంది.

బ్రోంకో టెస్ట్ అంటే ఏంటి ?

బ్రోంకో టెస్ట్ అనేది ఆటగాళ్ల స్టామినా (దీర్ఘకాల శక్తి)ని అంచనా వేసే ప్రత్యేకమైన పరుగుల పరీక్ష. ఇది వినడానికి సింపుల్‌గా అనిపించినా, అమలు చేయడం మాత్రం చాలా కఠినమైన టెస్ట్.

👉 ఈ టెస్ట్‌లో ఆటగాడు స్టార్ట్ పాయింట్ నుంచి ముందుగా 20 మీటర్లు పరుగెత్తి తిరిగి రావాలి.
👉 తరువాత 40 మీటర్లు పరుగెత్తి తిరిగి రావాలి.
👉 ఆపై 60 మీటర్లు పరుగెత్తి తిరిగి రావాలి.

ఇలా 20 + 40 + 60 మీటర్లు పరుగెత్తడం కలిపి ఒక సెట్ అవుతుంది. ఒక ఆటగాడు ఇలాంటి 5 సెట్‌లు ఆగకుండా పూర్తి చేయాలి. అంటే మొత్తంగా దాదాపు 1200 మీటర్లు పరుగెత్తాలి.

ఎవరు ఎంత వేగంగా ఈ 5 సెట్‌లను పూర్తి చేస్తారో అదే వారి ఫిట్‌నెస్ స్థాయిని చూపుతుంది. ఉదాహరణకి, పేస్ బౌలర్లు ఈ టెస్ట్‌ను ఒక నిర్దిష్ట టైమ్‌లో పూర్తి చేయాలి. బ్యాట్స్‌మెన్లు, స్పిన్నర్లకు కాస్త ఎక్కువ సమయం ఇస్తారు. ఫాస్ట్ బౌలర్లకు 8 నిమిషాలు 15 సెకన్లలోపు పూర్తి చేయడం బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. బ్యాట్స్‌మెన్లు, స్పిన్నర్లకు అదనంగా 15 సెకన్ల సడలింపు ఇస్తారు.

ఈ టెస్ట్ ఎందుకు?

ఈ టెస్ట్ ద్వారా ఆటగాళ్లు మైదానంలో మరింత ఫిట్‌గా, వేగంగా, చురుకుగా మారుతారని భావిస్తున్నారు. వికెట్ల మధ్య పరుగులు వేగంగా పూర్తి చేయడం, పొడవైన ఇన్నింగ్స్ ఆడేటప్పుడు స్టామినా నిలుపుకోవడం, రనౌట్ అవకాశాల్లో క్షణాల్లో స్పందించడం వంటి అంశాల్లో ఇది కీలకంగా మారనుంది.

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఈ టెస్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇది మరింతగా ఉపయోగపడుతుందని ఫిట్‌నెస్ ట్రైనర్లు చెబుతున్నారు.

అయితే, బ్రోంకో టెస్ట్‌ క్రికెట్‌లో కొత్తగా వ‌చ్చిన‌ కాన్సెప్ట్ కాదు. ఇప్పటికే 2002–2003లోనే అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ, కోచ్ జాన్ రైట్ కాలంలో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించారు. అయితే, ఇప్పుడు రెండు దశాబ్దాల తరువాత దీన్ని మరింత శాస్త్రీయంగా, క్రమబద్ధంగా మళ్లీ ప్రవేశపెట్టారు.

మొత్తానికి, యో-యో, బ్రోంకో టెస్ట్ కఠినంగా అనిపించినా, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అభిమానులు మరింత ఫిట్‌గా, మరింత ఎనర్జీతో ఆడే టీమిండియాను మైదానంలో చూడబోతున్నారు.

Leave a Reply