ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ..

ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ..
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా (నాగార్జున రైతు సేవా సహకార సంఘం) సింగిల్ విండో కార్యాలయంలో ఉద్యోగుల సిట్టింగ్ బాగోతం కాస్త బట్టబయలైంది. మంగళవారం రాత్రి వేళ ఏకంగా చైర్మన్ ఛాంబర్ లో నలుగురు ఉద్యోగులు మద్యం బాటిళ్లు, మిర్చి బజ్జీలతో మద్యం పార్టీ చేసుకోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం కాస్తా కోరం లేకపోవడంతో వాయిదా పడింది.
రైతులకు పూర్తి స్థాయిలో సమావేశం సంబంధించి సమాచారం ఇవ్వలేదని ఓ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే… అదే కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఉద్యోగులు మద్యం పార్టీ చేసుకోవడంతో రైతులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గం గడువు ముగియడంతో.. అధికారుల పాలన కొనసాగుతుండటంతో ఉద్యోగుల పై అజమాయిషీ లేకపోవడంతో నే ఏకంగా చైర్మన్ ఛాంబర్ లో ఇష్టారాజ్యంగా మద్యం పార్టీ చేసుకున్నారని, సదరు ఉద్యోగుల పై సహకార సంఘం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

