(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్ నడుమ నల్లమల్ల అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల వేటగాళ్లకు అటవీ శాఖ అధికారులు చుక్కలు చూపించారు. విశ్వసనీయ సమాచారంతో బైర్లూటి రేంజ్ లోని పెద్ద అనంతపురం సెక్షన్ బీట్ సమీపంలో సిద్దాపురం గ్రామానికి చెందిన 9 మంది వేటగాళ్లు అటవీలోకి ప్రవేశించారు.
ఈ సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేటగాళ్ల ముఠాను పట్టుకునేందుకు మూడు రోజులుగా మాటు వేశారు. ముఠా ఆచూకీ తెలియగానే అటవీశాఖ అధికారులు దాడి చేయగా.. సిద్దాపురం గ్రామానికి చెందిన పీట్ల కమల్ మాత్రమే దొరికాడు.
నిందితుడి నుంచి ఓ తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన 8 మంది వేటగాళ్ల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రహుప్ మాట్లాడుతూ, అటవీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు వణ్య ప్రాణులకు హాని కలిగించేందుకు అక్రమంగా అటవిలోకి ప్రవేశించిన, వాటిని చంపి మాంసాన్ని విక్రయించినా, అటవీ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరో ఎనిమిది మంది వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో వారిని కూడ కట్టుకుంటామని తెలిపారు. అటవీ ప్రాంత సమీపంలోని ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. వణ్య ప్రాణులను వేటాడే వేటగాళ్లను కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.
