ఆంధ్రప్రభ విజయవాడ : కొలంబోలో ఇటీవల జరిగిన తొలి మహిళా ప్రపంచ బ్లైండ్ క్రికెట్ కప్లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన మన తెలుగు క్రీడాకారిణి శ్రీ పి. కరుణ కుమారి ని సోమవారం గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ శ్రీమతి భరణి పుష్పగుచ్ఛాలతో స్వాగతించి దుశ్యాలువాతో సత్కరించారు.
అలాగే పి కరుణ కుమారి రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు, యువ క్రీడాకారులు, శాప్ సిబ్బంది భారత జాతీయ పతాకాలతో పెద్ద సంఖ్యలో పాల్గొని చప్పట్లతో, ఉత్సాహ నినాదాలతో ఆమెకు స్వాగతం పలికారు.
విమానాశ్రయం మొత్తం దేశభక్తి వాతావరణంతో మార్మోగగా, ప్రత్యేకంగా విద్యార్థులకు, స్థానిక క్రీడాకారులకు కరుణ కుమారి ని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ముందుకు సాగాలని శాప్ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ.. భారత బ్లైండ్ మహిళా క్రికెట్ జట్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిభావంతురాలిగా నిలిచిన పి.కరుణ కుమారి అసాధారణ ప్రదర్శన రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. ఆమె ఇలాగే మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర రావు , వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణ స్వామి, శాప్ బోర్డు సభ్యులు జగదీశ్వరి,సంతోష్ , వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, శాప్ సిబ్బంది, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ సిబ్బంది స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.

