Revolver | కాల్పుల కలకలం
- కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో ఘటన
- పోలీసులపై దాడి చేసిన నిందితుడు
- మోకాళ్లపై రివాల్వర్‌తో కాల్చిన ఎస్సై
Revolver | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగరానికి ఉత్తరాన ఉన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కల్లూరుపల్లి ప్రాంతానికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం హత్య చేశారు. ఆ హత్యకు సంబంధించి నిందితుడు పాడుబడి మూసివేసి ఉన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో sugar factory దాగి ఉన్నాడన్న సమాచారంతో శనివారం ఉదయం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చింగ్ చేశారు. ఈ నేపథ్యంలో చెట్టు చాటు నుంచి వస్తున్న ఓ వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ ఆది నారాయణ ప్రశ్నించగా.. ఆ వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశాడు. సమీపంలో ఉన్న ఎస్సై వేణు అక్కడికి చేరుకుని నిందితుడిని హెచ్చరిస్తూ తన సర్వీస్ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయినా ఆ వ్యక్తి వినకపోవడంతో ఎస్సై ఆ వ్యక్తి మోకాళ్ళపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి కత్తి కింద పడేసి లొంగిపోయాడు. విచారణలో ఆ వ్యక్తి తన పేరు జేమ్స్ అని, కల్లూరుపల్లిలో జరిగిన హత్యోదంతంలో నిందితుడిని అని ఒప్పుకున్నాడు. కాగా నిందితుడి దాడిలో హెడ్ కానిస్టేబుల్‌కు భుజంపై గాయమైంది. నిందితుడికి మోకాలుపై గాయమైంది. పోలీసులు ఈ విషయమై పూర్తి దర్యాప్తు చేపట్టారు.

