conference | అవగాహన అవ‌స‌రం..

conference | అవగాహన అవ‌స‌రం..

  • గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పాక్సో, బాల్యవివాహ చట్టాలపై వివ‌ర‌ణ‌
  • పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మహిళా పోలీసుల సదస్సు

conference | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన, బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం, శక్తి యాప్ ప్రాముఖ్యతపై చిత్తూరు జిల్లా మహిళా పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చిన్న రెడెప్ప, ఎస్‌ఐ. కరిమునిస్సా, సిబ్బంది కలిసి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఎస్‌ఐ చిన్న రెడెప్ప మాట్లాడుతూ, మీరంతా రేపటి పౌరులు. చిన్న వయసులోనే మంచి, చెడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో గుర్తించగలగాలి. ఎవరైనా అనవసరంగా తాకితే లేదా మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ‘నో’ అని చెప్పాలి. మీకు నమ్మకమైన గురువులకు, తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలి. బాల్యవివాహం ఒక పెద్ద సామాజిక సమస్య. 18 సంవత్సరాలు పూర్తికాకముందే బాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధం.

conference

చిన్న వయసులో పెళ్లి చేస్తే చదువు ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మీరు చదువులో ముందుకు వెళ్లి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి. పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన పోక్సో చట్టం చాలా కఠినమైంది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై ఎలాంటి లైంగిక నేరాలు జరిగినా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇలాంటి సంఘటన ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎస్‌.ఐ. కరిమునిస్సా మాట్లాడుతూ *అత్యవసర పరిస్థితుల్లో 112 (ఎమర్జెన్సీ నంబర్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) వంటి నంబర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇవి వెంటనే సహాయం అందిస్తాయి. ఎటువంటి ప్రమాదం ఎదురైనా మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ ద్వారా సులభంగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.

conference

అత్యవసర సమయంలో ఒకే బటన్ ప్రెస్ చేస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుంది. కుటుంబ సభ్యులకు కూడా అలర్ట్ వెళ్తుంది. మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, చట్టాల గురించి తెలియజేయడం, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేలా ప్రోత్సహించడమే పోలీసులు లక్ష్యం. ఈ సదస్సులో కళాశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply