Karvetinagaram | కలప అక్రమ రవాణా!

Karvetinagaram | కలప అక్రమ రవాణా!

  • పట్టించుకోని అటవీశాఖ అధికారులు

Karvetinagaram | ఆంధ్రప్రభ, కార్వేటినగరం : కార్వేటినగరం మండలం టికేయంపేట దళితవాడ నుంచి కలప అక్రమ రవాణా జోరుగా సాగిపోతోంది. మండల కేంద్రంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు ఇలాంటి కలప అక్రమ రవాణా గురించి పట్టించుకోవడం లేదు. కార్బట్టినగరం మండలంలో రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ కలప అక్రమ రవాణా వెనుకున్న అధికార పార్టీకి చెందిన రాజకీయ వ్యక్తులు ఏమిటో అన్న విషయంపై కార్వేటినగరం మండలంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న ఈ కలప అక్రమ రవాణా వ్యవహారం గురించి జిల్లా అటవీశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అటవీశాఖ అధికారులు తమ బాధ్యతలను విధులను విస్మరించి అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం వల్లనే కలప అక్రమ రవాణా మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగిపోతుందని మండల ప్రజలు వాపోతున్నారు. గడ్డి చేను మేసిన చందాన కార్వేటినగరం అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఎక్కువ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీకేయంపేట దళితవాడలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ప్రాంతంలో ఒక పత్రిక విలేకరి ఈ కలప అక్రమ రవాణా ఎవరికి సంబంధించింది అనే ప్రశ్నించగా కార్వేటినగరం మండలం అల్లాగుంట దళితవాడకు చెందిన టీడీపీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుని పేరు తెలపడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆ నాయకునికి ఈ కలప అక్రమ రవాణాకు సంబంధం ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. మండలంలో టీడీపీ నాయకుల పేర్లు చెప్పి ఇలా కలప అక్రమ రవాణా చేస్తున్నాడా అన్న సందేహాలను కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply