Farmer’s Market | చిరుధాన్యాలతో ఆరోగ్యం

Farmer’s Market | చిరుధాన్యాలతో ఆరోగ్యం

  • ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
  • కదిరిలో రైతు అంగడి ప్రారంభం

Farmer’s Market | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : చిరుధాన్యాలతో తయారయ్యే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి పట్టణంలో రాయలసీమ ప్రాంతీయ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అంగడి కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం రైతుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంలో కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు అంగడిలో అందుబాటులో ఉన్న చిరుధాన్యాలకు సంబంధించిన బియ్యాలు, ఇడ్లీ, ఉప్మా రవ్వలు, వేరుసెనగ విత్తనాలు, నూనెలు, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు, దేశీయ రకాల వరి బియ్యాలను పరిశీలించారు. రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడి వాటి మార్కెట్ అమ్మకాలు, వినియోగదారుల ఆదరణపై వివరాలు తెలుసుకున్నారు. చిరుధాన్యాలకు కేవలం మార్కెట్ మాత్రమే కాకుండా కుటుంబ స్థాయిలో వినియోగం కూడా పెరగాలని సూచించారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

రైతు సంఘాలు కార్పొరేట్ స్థాయిలో ఆలోచిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. వినియోగదారుల కొనుగోళ్లను పెంచేవిధంగా రైతు సంఘాలు చర్యలు తీసుకుంటే మార్కెట్‌లో పోటీ అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతీయ వనరుల కేంద్రంలో ఉన్న 30 రైతు సంఘాలు, సహాయక సంస్థలు, ప్రభుత్వ శాఖలను కలిపి రాబోయే రోజుల్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు అంగడి అవసరం, రైతు సంఘాల బలోపేతం, మార్కెట్ విస్తరణ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాధాన్యతపై వాసన్ సంస్థ ప్రతినిధి ఉత్తప్ప రైతు సంఘాల సభ్యులకు వివరించారు. HDFC CSRలో FRDP కార్యక్రమం భాగంగా రైతు సంఘాలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

రెడ్స్ సంస్థకు చెందిన భానుజ మేడం మాట్లాడుతూ కదిరిలో రైతు సంఘాలకు ఒక స్థిరమైన అమ్మకాల కేంద్రం ఉండడం అత్యవసరమని అన్నారు. భవిష్యత్తులో రైతు సంఘాలకు మరింత మద్దతు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసయ్య మాట్లాడుతూ రైతు సంఘాలు తమ అవసరాల మేరకు త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాయలసీమ ప్రాంతీయ వనరుల కేంద్రం ద్వారా సమిష్టిగా ముందుకు సాగుతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసయ్య, వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి సానవుల్లా, ఉద్యాన శాఖ డివిజన్ అధికారి లావణ్య, రెడ్స్ సంస్థ భానుజ, CSA సంస్థ ఆదినారాయణ, జనజాగృతి సంస్థ శ్రీనివాసులు రెడ్డి, AF Ecology సంస్థ సతీష్ కుమార్, MYARDA సంస్థ నుంచి శ్రీనివాస్, 30 రైతు సంఘాల ప్రతినిధులు, చిరుధాన్య వంటలు తయారు చేసిన మహిళలు, వాసన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రైతు అంగడి కార్యక్రమం రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో దోహదపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply