Soybean | పంట కొనుగోళ్లపై రైతన్న కన్నెర్ర..!

Soybean | పంట కొనుగోళ్లపై రైతన్న కన్నెర్ర..!

  • మార్క్ ఫెడ్ డీఎం, డీసీవో నిర్బంధం..!

Soybean | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : సోయాబీన్ పంట కొనుగోళ్ళను ప్రభుత్వం నిరాకరించడంపై రైతులు ఆగ్రహించారు. ఇవాళ‌ ఆదిలాబాద్ జిల్లా బోత్ మార్కెట్ యార్డులో సోయాబీన్ పంట(Soybean crop) నిల్వలతో వచ్చిన రైతులు అధికారులను నిలదీశారు. అంతటితో ఆగకుండా మార్కెట్ యార్డ్ ఆఫీసులో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, జిల్లా కోపరేటివ్ అధికారి మొహన్ ను ఆఫీసు గదిలో తాళంవేసి నిర్బంధించారు. రంగు మారిన సోయాబీన్ నాణ్యత లేదనే సాకుతో కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది.

  • రైతు సమస్యలపై బీఆర్ఎస్ రేపటి నుండి పోరాటం… మాజీ మంత్రి జోగు రామన్న

సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఈ మేరకు రైతు సమస్యలపై శుక్రవారం (రేపు) జైనథ్, బేల మండలాల్లో కాప్రి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు జోగు రామన్న మీడియా(media)కు తెలిపారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యే నివాసాలను ముట్టడిస్తామన్నారు. ఈనెల 5న జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించి ఆందోళన చేపడతామని, ఈనెల 6న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ పాటిస్తామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు రైతు సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తామని జోగు రామన్న స్పష్టం చేశారు.

Leave a Reply