Fake GST | నకిలీ జీఎస్టీ బిల్లుల కుంభకోణం..

Fake GST | నకిలీ జీఎస్టీ బిల్లుల కుంభకోణం..

  • అమాయకుల పేర్లతో సంస్థలు
  • కోట్ల లావాదేవీలు,
  • బాధితుడికి రూ.43 లక్షల నోటీసు
  • జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

Fake GST | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నకిలీ జీఎస్టీ బిల్లుల మోసాల్లో బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తుండటంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది. చిత్తూరు జిల్లాలో తాజాగా బయటపడిన ఘటన ఈ కుంభకోణం ఎంత లోతుగా విస్తరించిందో చెప్పకనే చెబుతోంది. చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన విజయ చక్రవర్తి, తనకు తెలియకుండానే తన పేరుతో ఒక వ్యాపార సంస్థను స్థాపించి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారని, ఆ సంస్థ పేరిట రూ.43 లక్షల జీఎస్టీ బకాయి చెల్లించాలని నోటీసు రావడంతో షాక్‌కు గురయ్యానని సోమవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జాతీయ దళిత హక్కుల నేత నాగరాజ్‌తో కలిసి ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

విజయ చక్రవర్తి వివరాల ప్రకారం.. గతంలో తాను మదీనా స్టీల్స్‌లో పని చేసిన సమయంలో షేక్ రిజ్వాన్ తన వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నారని, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయానని చెప్పారు. ప్రస్తుతం ఆ సంస్థలో పని చేయడం లేదని, వేరే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు అకస్మాత్తుగా రూ.43 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు రావడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఈ విషయమై జీఎస్టీ అధికారులను సంప్రదించగా, సంస్థ పేరుతో జరిగిన వ్యాపారానికి సంబంధించిన మొత్తం చెల్లించాల్సిందేనని చెప్పారని వాపోయారు. తాను ఎలాంటి వ్యాపార సంస్థను ప్రారంభించలేదని, ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

Fake GST

తన ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా బ్యాంకులో కరెంట్ అకౌంట్ తెరిచి, ఆ ఖాతా ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు సమాచారం లభించిందని విజయ చక్రవర్తి వెల్లడించారు. పత్రాలు తీసుకుని ఫోర్జరీ చేసి, నమ్మకద్రోహానికి పాల్పడి తన పేరుతో వ్యాపార సంస్థలు స్థాపించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ విషయంలో తాను ఇప్పటికే భారత ప్రధాని, రాష్ట్రపతి, సంబంధిత కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు పంపినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన కారణంగా షేక్ రిజ్వాన్ తనను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దళిత హక్కుల నేత నాగరాజ్ మాట్లాడుతూ.. కూలి పనులు చేసుకుని జీవించే విజయ చక్రవర్తి రూ.43 లక్షల జీఎస్టీ ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. గత నెల రోజులుగా పత్రికల్లో జీఎస్టీ కుంభకోణాల పై వరుసగా కథనాలు వస్తున్నా జీఎస్టీ అధికారులు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. నకిలీ బిల్లుల ద్వారా దాదాపు రూ.30,000 కోట్ల వరకు కేటుగాళ్లు స్వాహా చేసినట్లు పార్లమెంటులో ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని గుర్తుచేశారు. లక్ష రూపాయల బకాయి ఉన్నా సామాన్యుల పై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న అధికారులు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో జీఎస్టీ అధికారుల పాత్ర కూడా ఉందని, వారి మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని, దీనిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నకిలీ బిల్లుల మోసాల్లో అమాయకుల పేర్లను దుర్వినియోగం చేస్తున్న కేటుగాళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ కుంభకోణం ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంత మంది అమాయకులు బలవుతారో అన్న ఆందోళనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply