Mla Rajesh Reddy | దేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీనే..

Mla Rajesh Reddy | దేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీనే..
- నాగర్ కర్నూల్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుదాం
- ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
Mla Rajesh Reddy | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : భవిష్యత్‌లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కలిసికట్టుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ కూచిపూడి రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల భవనానికి నిధులు కేటాయించామని, పట్టణానికి రూ.45 కోట్ల సీసీ రోడ్లు వేయించామని, ఇంకా రూ.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూ.200 కోట్లతో చేపడుతున్నామని, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే పేదల బతుకులు బాగుపడతాయని తెలిపారు.
దేశంలో 141 సంవత్సరాల పాటు ప్రజల ఆదరణ పొందుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ విధానాలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిజాం అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య మాజీ మార్కెట్ చైర్మన్‌లు వల్లభ రెడ్డి ఈశ్వర్ రెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు హబీబ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
