Anantapur| గర్భాశయ క్యాన్సర్ పై సదస్సు

Anantapur| గర్భాశయ క్యాన్సర్ పై సదస్సు
- డాక్టర్ ముచ్చుకోట సుష్మాకు అవార్డు
Anantapur| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : బెంగళూరులోని BIEC వేదికగా 2025 డిసెంబర్ 19 నుంచి 21 వరకు నిర్వహించిన 74వ ఇండియన్ నేషనల్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో డా. సుష్మా ముచ్చూకోట గర్భాశయ ముఖ క్యాన్సర్ (Cervical Cancer) అంశంపై చేసిన తమ అత్యుత్తమ మౌఖిక ప్రజెంటేషన్‌కు బెస్ట్ ఓరల్ ప్రెజెంటేషన్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును డిసెంబర్ 21న సాయంత్రం 4 గంటలకు గౌరవనీయమైన, విశిష్ట న్యాయనిర్ణేతల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ జాతీయ స్థాయి సదస్సులో దేశవ్యాప్తంగా 1036 మంది ప్రతినిధులు పాల్గొనగా, వారిలో నుంచి కేవలం 60 మంది వక్తలు మాత్రమే ప్రజెంటేషన్లకు ఎంపికయ్యారు. ఆ ఎంపికైన వక్తలలో డా. సుష్మా ముచ్చూకోట ప్రజెంటేషన్ అత్యుత్తమంగా నిలిచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించారు.

డా. సుష్మా ముచ్చూకోట ప్రస్తుతం బెంగళూరులోని ఆదిత్య (Adhithya) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందినవారు కావడం రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఈ అవార్డుతో పాటు ఆమెకు రూ. 10వేల నగదు బహుమతి లభించింది. ఈ సందర్భంగా డా. సుష్మా ముచ్చూకోట, ఈ నగదు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతా సూచకంగా, క్యాన్సర్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి (CM రిలీఫ్ ఫండ్) కు విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

డా. సుష్మా ముచ్చూకోట విద్యా పరిశోధన రంగాల్లో విశేష సేవలు అందిస్తూ, ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. ఈ తాజా అవార్డు ఆమె అంకితభావానికి, మానవీయ విలువలకు, నిరంతర కృషికి మరొక గొప్ప గుర్తింపుగా నిలిచింది.
