- రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. నా హస్తిన ప్రయాణం
- గాంధీభవన్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్
ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు చూస్తున్నారని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, రాజకీయ కోణంలో ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం, చేయూత ఆశించడం ప్రజల సార్వభౌమాధికార హక్కు అని గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
దమ్ముంటే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి.. చూద్దాం అంటూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విరిరారు. భాష అనేది ప్రజలు ఇష్టంతో నేర్చుకునేది మాత్రమేనని, బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
అవహేళన తప్ప కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. నా హస్తిన ప్రయాణమని, దాన్ని కూడా రాజకీయం చేస్తారా..? అంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
”నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది తీవ్రంగా సంక్షౌభంలో కూరుకుపోతుంది. సీట్ల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలి. బీజేపీ కుట్రలను సాగనివ్వం.. ధీటుగా ఎదుర్కొంటాం” అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
”తమిళనాడుకు మెట్రోకు అనుమతిస్తారు కానీ తెలంగాణకు ఎందుకివ్వరు. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రోకు అనుమతులు ఇవ్వడంలేదు. ఎప్పటిలోగా మెట్రోకు అనుమతులు తెస్తారో కిషన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారు. సబర్మతిని, గంగానది, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ మేం మూసీని ప్రక్షాళన చేయొద్దా? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి” అని రేవంత్ డియాండ్ చేశారు.
కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కులగణనపై విమర్శలు చేస్తున్నారు. కులగణనలో పాల్గొనాలని కెసిఆర్ ను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదు? లోపాలు ఉన్నాయని విమర్శించేవారు ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి” అంటూ సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయాలనుకునే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.