IND vs SL | సిరీస్ వేటలో టీమిండియా.. ప్రాక్టీస్ షురూ!

- వైజాగ్‌లో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ జోరు
- శ్రీలంకతో పోరుకు భారత్ సై!
- ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెమటోడ్చిన హర్మన్‌ప్రీత్ సేన
విశాఖపట్నం, (ఆంధ్రప్రభ/స్పోర్ట్స్ డెస్క్) : సాగర తీర నగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ క్రికెట్ సమరానికి వేదికైంది. భారత్-శ్రీలంక మహిళా జట్ల మధ్య ఆదివారం (డిసెంబర్ 21) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం నగరం సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళా జట్టు, అదే జోరును టీ20ల్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో ముమ్మర శిక్షణ
విశాఖ చేరుకున్న భారత జట్టుకు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం నుంచే ఇరుజట్లు డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంక ప్లేయర్లు నెట్స్‌లో శ్రమించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు భారత జట్టు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లాంగ్ షాట్లతో హోరెత్తించగా, షఫాలీ వర్మ భారీ సిక్సర్లతో అలరించింది. స్పిన్ దిగ్గజం దీప్తి శర్మ, యువ బౌలింగ్ సంచలనం శ్రీ చరణి తమ బౌలింగ్‌కు పదును పెట్టారు. శిక్షణ అనంతరం భారత జట్టు నోవాటెల్‌కు, శ్రీలంక జట్టు షెర్టాన్ హోటల్‌కు చేరుకున్నాయి.
కాగా, ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్‌లు విశాఖలో జరగనున్నాయి. తరువాత మూడు మ్యాచ్ లు తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి.
- డిసెంబర్ 21 (ఆదివారం): మొదటి టీ20, రాత్రి 7:00 గంటలకు.
- డిసెంబర్ 23 (మంగళవారం): రెండో టీ20, రాత్రి 7:00 గంటలకు.
ఆ తదుపరి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి.
భారత జట్టు (T20I Squad):
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమన్‌జ్యోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (wk), జి. కమలిని (wk), ఎన్. శ్రీ చరణి, వైష్ణవి శర్మ.
పెరుగుతున్న క్రేజ్.. కిక్కిరియనున్న స్టేడియం!
డబ్ల్యూపీఎల్ (WPL) సక్సెస్, ఇటీవల సాధించిన వరల్డ్ కప్ టైటిల్‌తో దేశంలో మహిళల క్రికెట్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడంతో వైజాగ్ ఫ్యాన్స్‌లో జోష్ కనిపిస్తోంది.
