తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : అతివేగంగా వెళుతున్న ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన ఈడిగి నర్సింలు(35) ఓ కిరణాషాపు నిర్వహిస్తున్నాడు.
అయితే తండ్రి గోపయ్య అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం తాండూరులోని ఆసుపత్రిలో చూపించుకుని తిరిగి బయల్దేరాడు. తండ్రి గోపయ్యను ఇంట్లో దించేందుకు ఇద్దరు కలిసి స్కూటీపై వెళుతున్నారు. చెంగోల్ సమీపంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ లారీ (టీఎస్34 టీబీ0118) వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింలు స్కూటీ పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి గోపయ్యకు గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 సహాయంతో నర్సింలు మృతదేహాన్ని, తండ్రి గోపయ్యను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నర్సింలు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గోపయ్యను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మృతుడు నర్సింలుకు భార్య నర్మద, ఇద్దరు కుమారులున్నారు. నర్సింలు మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణం లారీ అతివేగంతో పాటు రాంగ్ రూట్‌లో వచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.