TG | ‘రైతు భరోసా’ నిధులు విడుద‌ల చేయండి – అధికారుల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆదేశం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించాల‌ని సూచించారు. ప్రజాభవన్‌లో నేడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో డిప్యూటీ సీఎం రైతు భ‌రోసాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండెక‌రాల రైతుల‌కు అందిన రైతు భ‌రోసా నిధుల వివరాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.. అలాగే రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రజాభవన్‌లో సమావేశం అనంతరం బ్యాంకర్ల సమావేశంకి హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… ‘తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దీంట్లో బ్యాంకర్ల పాత్ర కూడా కీలకం. బ్యాంకులకు ఒకేసారి రుణమాఫీ పేరుతో 22 వేల కోట్లు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వంది. మరే రాష్ట్రంలో ఇది జరగలేదు’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *